ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్టే కనిపిస్తోంది. నిన్న జరిగిన సమావేశంలో ప్రధాని ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అమిత్‌షా ఈ మేరకు ప్రధానిని ఒప్పించినట్లు సమాచారం. కేంద్ర నిర్ణయంపై అమిత్‌షా చంద్రబాబుకు వివరించినట్టు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై బాబును ఒప్పించేందుకు వెంకయ్యనాయుడు నేడు భేటీ కానున్నారు. నిన్న జరిగిన కీలక సమావేశం అనంతరం ఏపీలో బీజేపీ వ్యవహారాలు చూస్తున్న ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలతో ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరేంటో తేటతెల్లమైంది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని, 14వ ఆర్థిక సంఘం తేల్చిందని తెలిపారు. అయితే ఈ నిర్ణయంతో ఏపీ ప్రజలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, హోదాకు సమానమైన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుందని ఆయన చెప్పారు.
ఇన్నాళ్లు హోదాపై నాన్చిన కేంద్రం మరో రెండుమూడు రోజుల్లోనే ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్నాళ్లు హోదాపై తర్జనభర్జన పడిన ఏపీ ప్రజలకు ఒక స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుందో, మరెవరికి ప్రతికూలంగా మారుతుందోనని ఏపీలోని పొలిటికల్ పార్టీలు విశ్లేషణ చేస్తున్నాయి.
Comments
Post a Comment