జట్టుకు రంగేసుకుంటున్నారా... ముందు ఈ విషయం తెలుసుకోండి
ప్రస్తుత సమాజంలో యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు తొక్కుతోంది. మారుతున్న అభిరుచులు, అలవాట్లతో ప్రపంచం రంగులు పులుముకుంటోంది. జుట్టుకు వేసుకునే రంగు దగ్గర్నుంచి కాళ్ల గోళ్లకు వేసుకునే రంగుల దాకా అన్నీ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా ఉండాలని నేటి సమాజం భావిస్తోంది. ఇది ఈతరం ఫాలో అవుతున్న బ్యూటీ మంత్ర. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ తక్కువేమీ కాదు. అమ్మాయిలకు ధీటుగా అందగాళ్లనిపించుకోవడానికి ఫ్యాషన్ ఫ్యాంటసీలో విహరిస్తున్నారు. అయితే ఫ్యాషన్‌పై యువత పెంచుకున్న మోజు వారిని కొత్త సమస్యల్లోకి నెట్టేస్తోంది. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి ? ఫ్యాషన్ ముసుగులో యువతీయువకులను రోగాల ఉచ్చులోకి లాగుతున్న భూతాలేంటి ?
హైహీల్స్: అమ్మాయిలు హుందాను చాటుకునేందుకు ఈ హైహీల్స్‌ను వేసుకుంటున్నారు. కాలివెనుక భాగం గాల్లో ఈ హైహీల్స్‌ను డిజైన్ చేస్తారు. దీనివల్ల ముందర భాగంపై అధిక బరువు పడుతోంది. దీనివల్ల కాలి మడమలు దెబ్బతినే ప్రమాదముంది. మోడ్రన్ కల్చర్ పేరుతో చాలామంది అమ్మాయిలు వీటిని ధరిస్తున్నారు. ఇబ్బందిగా అనిపిస్తున్నప్పటికీ ఎక్కడ చిన్నబోతామేమోనని భరిస్తున్నారు.
కాంటాక్ట్ లెన్స్‌లు: కళ్లలో కనుగుడ్డు మెరుపులు మెరిసేలా కొంతమంది కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటుంటారు. దృషిలోపాన్ని ప్రపంచానికి తెలియకుండా వీటిని ధరిస్తుంటారు. డాక్టర్లను సంప్రదించకుండా ఈ కాంటాక్ట్ లెన్స్‌లను పెట్టుకోవడం వల్ల, వీటిని అమర్చుకునే ప్రయత్నంలో కంటిచూపు శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని ఐ స్పెషలిస్టులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే వీటిని ధరించాలని సూచిస్తున్నారు.
పెక్సెల్స్: కొంతమంది తమ వయసును కప్పిపుచ్చుకోవడం కోసం జుట్టుకు రంగులేస్తుంటారు. ముఖాన్ని మేకప్‌తో కవర్ చేస్తుంటారు. అయితే వీరు చేస్తున్న ఈ రెండు పనుల వల్ల క్యాన్సర్‌ను కొనితెచ్చుకుంటున్నారు. జుట్టుకు వేసే రంగుల్లో, ముఖానికి పూసుకునే క్రీముల్లో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. దీనివల్ల కాలక్రమేణా జుట్టు రాలిపోవడమే కాకుండా, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే వీటి వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది.
హెవీ ఇయర్ రింగ్స్: ఆడవాళ్లకు ఆభరణాలంటే విపరీతమైన ఇష్టం. వాటిని ఎంత ఖర్చుపెట్టి కొనడానికైనా వెనుకాడరు. చెవులకు ఇంపుగా ఉంటాయని కెంపులు ధరిస్తారు. అయితే చెవులకు ధరించే ఆభరణాల వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయట. బరువైన ఇయర్ రింగ్స్‌ను పెట్టుకోవడం వల్ల.. ఆ ప్రదేశం సాగిపోయి తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. పట్టించుకోకుండా అలాగే ధరిస్తే ఆ గాయం పుండుగా మారి బాధిస్తుంది. వీలైనంత తేలికైన ఆభరణాలు పెట్టుకుంటేనే మంచింది.
ఫ్లిప్‌ఫ్లాప్స్: కాలేజీ యువత ఎక్కువగా ధరించే చెప్పులు ఫ్లిప్‌ఫ్లాప్ స్లిప్పర్స్. ఇవి ఎంతో తేలికగాను, సౌకర్యవంతంగానూ ఉండటం వల్ల ఎక్కువ మంది వీటినే ఎంపిక చేసుకుంటున్నారు. వీటిని ధరించడం వల్ల కాళ్లకు ప్రమాదం. అంతేకాదు, ఏదైనా కాలికి దెబ్బ తగిలినా ఇవి ఏ మాత్రం రక్షణ కల్పించలేవు.
నెక్‌టైస్, టైట్ షర్ట్ కాలర్స్: ఆఫీసుకెళ్లే ప్రతీ ఒక్కరూ హుందాగా కనిపించడం కోసం మెడకు టై కట్టుకుంటుంటారు. ఇలా టై కట్టుకుని రాకపోతే అడుగుపెట్టనివ్వని ఆఫీసులు కూడా ఉన్నాయి. అయితే మెడకు బిగుతుగా టై కట్టుకోవడం వల్ల అనేక నష్టాలున్నాయట. మెదడుకు, కళ్లకు రక్తప్రసరణ నెమ్మదిస్తుందట. దానివల్ల రాబోయే రోజుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తేలింది. అంతేకాకుండా గ్లకోమాకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టైట్ అండర్‌వేర్స్: మగవారిలో చాలామందికి టైట్ అండర్‌వేర్స్ ధరించే అలవాటు ఉంటుంది. దీనివల్ల ముప్పు పొంచి ఉందట. టైట్ అండర్‌వేర్స్ ధరించడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట. భవిష్యత్‌లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందని తెలిసింది. దీనివల్ల మానసిక రుగ్మతలు పెరిగే అవకాశముందని తేలింది.
టైట్ జీన్స్: పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని మన దేశంలో జీన్స్ ధరించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా టైట్ జీన్స్ ధరించడం ఫ్యాషనైపోయింది. వీటిని ధరించడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుందట. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిసింది. టైట్ జీన్స్ ధరించడం వల్ల వృషణాలు కుచించుకుపోయి... శృంగారపరమైన సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Comments
Post a Comment