తిన్నంతే వడ్డించాలి.. ఆచరణలోకి మోదీ ‘మన్‌కీ బాత్’!
- హోటళ్లలో ఆహారం వృథాపై దృష్టి
- ఎంత తినగలిగితే అంతే పెట్టాలి
- ‘ప్లేటు’కు ఒకేవిధమైన కొలత
- హోటళ్లకు పాశ్వాన్ సూచనలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ‘‘ప్లేటుకు నాలుగు ఇడ్లీలుంటాయ్! మీకు రెండే కావాలంటే ఇవ్వలేం. నాలుగు తెప్పించుకుని తిన్నన్ని తినండి. మిగిలినవి వదిలేయండి’’... హోటళ్లు, రెస్టారెంట్లలో ఇలాంటి ‘వృథా’ వ్యవహారానికి కళ్లెం పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ‘హోటళ్లు, రెస్టారెంట్లలో తినగలిగినంతే పెట్టాలి’ అని ఆయన నినదిస్తున్నారు. భారతలో ఆహారం వృథాపై గతనెల 26న ‘మన్ కీ బాత’లో ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేశంలో ఎంత ఆహారం వృథా అవుతోందో ఎప్పుడైనా ఆలోచించారా? అలా వృథా అవుతున్న ఆహారంతో ఎంతమంది నిరుపేదల కడుపు నింపవచ్చో తెలుసా? ఆహారాన్ని వృథా చేయడమంటే సమాజానికి, పేదలకు అన్యాయం చేసినట్లే’’ అని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామ్‌విలాస్ పాశ్వాన్ ఈ అంశంపై దృష్టి సారించారు. ఆయన ఆలోచనలో ఆచరణలోకి వస్తే... దేశవ్యాప్తంగా హోటళ్లలో వినియోగదారులకు అందించే ఆహారానికి ఒకే ‘కొలత’ ఉంటుంది. దీనిపై ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులతో పాశ్వాన్ చర్చించారు. అయితే... ఇదంతా తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్న చొరవ అని తెలిపారు. ‘ప్లేటు చికెన్ అంటే... ఎన్ని ముక్కలు పెడతారు? నాలుగా? ఐదా? ఆరా? ఎన్నో చెప్పండి! ఎన్ని ముక్కలు తినగలరో అన్నే తెప్పించుకుంటారు. దానివల్ల ఆహారం వృథా కాకుండా ఉంటుంది’ అని హోటళ్ల యజమానులకు పాశ్వాన్ సలహా ఇచ్చారు. ‘ప్లేటు’లో ఎంత పెడతారో తెలియకుండానే తెప్పించుకోవడం, అది తినలేక వృథాగా వదిలేయడాన్ని తాను రెస్టారెంట్లలో గమనించానని ఆయన తెలిపారు. అలా కాకుండా... ‘ప్లేటుకు ఇంత! చికెన్ ముక్కలు నాలుగుంటాయి. రొయ్య ముక్కలైతే ఆరు ఉంటాయి అని స్పష్టత వచ్చేలా ఒకేరకమైన, ప్రమాణిక కొలత ఉంటే బాగుంటుంది’’ అని ఆయన తెలిపారు. ‘‘ఒకరు రెండు ఇడ్లీలు మాత్రమే తినగలిగినప్పుడు... ప్లేటులో నాలుగు ఇవ్వడం ఎందుకు?’ అని పాశ్వాన్ ప్రశ్నించారు. ఇలా చేయడం ఆహారంతోపాటు డబ్బునూ వృథా చేయడమే అని తెలిపారు. హోటళ్లు స్వచ్ఛందంగా ఈ చర్యలు తీసుకోవాలని... వారు అవసరమనుకుంటే చట్టం చేసేందుకూ సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. అన్నట్లు.. హోటళ్లలో ఆహార వృథాను అరికట్టేలా రూపొందించే నియమావళికి ‘మోదీ మెనూ’ అనే పేరు పెడతారని వార్తలు రావడం కొసమెరుపు!
Comments
Post a Comment