రూపాయికే 1జిబి... రిలయన్స్ జియోకి షాకిచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ !
ముంబై: ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సేవలందిస్తున్నట్లు ప్రకటించి టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో కొత్త ఒరవడికి నాంది పలికిన సంగతి తెలిసిందే. 50 రూపాయలకే 1జిబి 4జీ డేటా అందిస్తున్నట్లు ప్రకటించి ముఖేష్ అంబానీ టెలికామ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిర్‌టెల్, ఐడియాకు నిమిషాల వ్యవధిలో నష్టాలను మిగిల్చారు. సెప్టెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా జియో సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖేష్ తెలిపారు. వాయిస్ కాల్స్ మొత్తంగా ఫ్రీగా చేసుకోవచ్చని అనడంతో దేశమంతా దీని గురించే చర్చించింది. అదెలా సాధ్యమంటూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. రిలయన్స్ జియోను తట్టుకుని టెలికామ్ రంగంలో తమ స్థానాన్ని కాపాడుకోవడం ఎలా అని ఇతర ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రిలయన్స్ జియో దెబ్బకు అన్ని కంపెనీలు గల్లంతే అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తాజా ప్రకటనతో మరో సంచనానికి తెరలేపింది.
రిలయన్స్ జియోకు ధీటుగా 249 రూపాయలకే నెల రోజుల కాలపరిమితితో అపరిమిత ఇంటర్నెట్‌ను అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు, 50 రూపాయలకు 1జిబి అందిస్తామని ప్రకటించిన రిలయన్స్ జియోకు పోటీగా 1 రూపాయికే 1జిబి అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. 1జీబీ ఉన్న ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటే కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చవుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ శ్రీవాత్సవ తెలిపారు. అయితే ఈ అపరిమిత డేటా ఆరునెలలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నిర్దిష్ట చార్జీలు వర్తిస్తాయని ఆయన వివరించారు. కేవలం బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని శ్రీవాత్సవ చెప్పారు. 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి ఈ అపరిమిత డేటా సేవలు వినియోగదారులు పొందగలరని సీఎండీ శ్రీవాత్సవ తెలిపారు.
Comments
Post a Comment