ఇతను రఘురాం రాజన్‌ గురువు*******************************************





ఇతను రఘురాం రాజన్‌ గురువు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూశారా? ఒంటిపై లుంగీ తప్ప కనీసం షర్టు కూడా లేదు. మాసిన గడ్డం.. పెరిగిన జుట్టూ చూస్తుంటే ఎవరైనా సరే అతన్ని పిచ్చివాడనే అనుకుంటారు. కానీ.. ఇతని జీవితాన్ని ఒకసారి తరచి చూస్తే ఎవరైనా సరే విస్తుపోతారు. అతని సంకల్పం.. లక్ష్యం.. ఆదర్శం కనీసం ఒక్క క్షణమైనా ఆలోచింపజేస్తుంది. కేవలం మాటలు కాదు.. చేతలు ఎంత కష్టంతో కూడుకున్నాయో తెలియజేస్తుంది. ఎందుకంటే.. అతను పిచ్చివాడు కాదు. ఐఐటీ దిల్లీలో ప్రొఫెసర్‌. ఇది మూడు దశాబ్దాల క్రితం మాట. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. వందల మంది గొప్పగొప్ప వ్యక్తులను.. విద్యావంతులను దేశానికి అందించిన అసాధరణ వ్యక్తి. మొన్నటివరకు రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్‌రాజన్‌ కూడా ఆయన శిష్యుడే అని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంత గొప్ప వ్యక్తి ఇలా ఒంటిపై దుస్తులు లేకుండా.. సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడనే విషయాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
అలోక్‌సాగర్‌.. 1973లో దిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తిచేశాడు. ఐఐటీ దిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు. అయినా మనసులో ఏదో తెలీని వెలితి. రొటీన్‌ లైఫ్‌కు భిన్నంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన. ఆ ఆలోచనలోంచే పుట్టిన కోరిక అతన్ని వూహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే కోరిక ఐఐటీ దిల్లీలో ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేయించింది. ఇదంతా ఎక్కడో కొండల్లో కోనల్లో నివసించే ఆదివాసీల కోసమే. మారుమూల పల్లెల్లో నివసించే నిస్వార్థమైన ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతానికి చేరుకున్నాడు.
కనీసం విద్యుత్‌.. రోడ్డు సౌకర్యంలేని మారుమూల గ్రామమైన కొచాముచేరుకుని.. అంతటి అసాధరణ వ్యక్తి సాధారణ వ్యక్తిగా అక్కడి ఆదివాసీ ప్రజల్లో ఒకడిగా మారిపోయాడు. మూడు దశాబ్దాలుగా అలాగే జీవిస్తున్నాడు. బేతుల్‌.. హోషంగాబాద్‌ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నాడు. దేశానికి సేవ చేయడం అంటే.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడమే అని నమ్మి మూడు దశాబ్దాలుగా వారి కోసం కష్టపడుతున్నాడు. దానిలో భాగంగా ఇప్పటివరకు ఒక్కడే దాదాపు 50వేల మొక్కలు నాటాడు. ఇప్పటికీ.. అలోక్‌ సాధారణ జీవితాన్నే గడుపుతున్నాడు. కేవలం అతని దగ్గర మూడు జతల కుర్తాలు.. ఓ సైకిల్‌ మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు ఆ సైకిల్‌పైనే తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ.. మారుమూల ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నాడు.
ఇటీవల బేతుల్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటన అతను ఎవరనే విషయం అక్కడి ప్రజలకు తెలిసేలా చేసింది. ఎన్నికల సమయంలో అధికారులు అలోక్‌ విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే తాను ఎవరు? ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు? విద్యార్హతలు ఏంటన్న విషయాన్ని వెల్లడించాడు. అవి చూసి అక్కడి అధికారులు కూడా నమ్మలేదు. కానీ అతను చెప్పిన వివరాలపై విచారించి.. నిజం తెలుసుకుని విస్తుపోయారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే.. ‘దేశంలో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. కానీ.. చాలామంది ప్రజలకు సేవ చేయడం మరచి తమ సర్టిఫికెట్స్‌ చూపించుకునేందుకే వారి తెలివితేటలను ఉపయోగిస్తున్నారు’ అని అంటున్నాడు అలోక్‌. మంచి ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం వదిలి సాధారణ వ్యక్తిలా కనీస సౌకర్యాలు లేని సామాన్యుల కోసం చేస్తున్న అతని కృషి.. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Comments

Popular posts from this blog

How to Transfer Mobile Internet data’s (MBs) From One Number to Another

How to generate leads for digital marketing company