వారు తిన్న ఆకులపై వీరు పొర్లుదండాలా?
బ్రాహ్మణులు తిని వదలేసిన అరిటాకులపై అక్కడ దళితులు పొర్లుదండాలు పెడుతుంటారు. అలా పొర్లుదండాలు చేస్తే అన్ని వ్యాధులు మటుమాయం అవుతాయట. ఏ సమస్యలున్నా అవి పరిష్కారమవుతాయట. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా తమిళనాడు, కర్ణాటకలో ఇది అనాదిగా పాటిస్తున్న ఆచారం. ఏటా ఆలయ ఉత్సవాల సందర్భంగా ఈ ఆచారం కొనసాగుతోంది. దీనిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఆచారంపై నిషేధం విధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 'మేడ్ స్నాన' అనే పేరుతో కొనసాగుతున్న ఈ ఆచారాన్ని 'అమానవీయం, మూఢనమ్మకం'గా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఇలాంటి ఆచారాల వల్ల పొర్లుదండాలు పెడుతున్న వారి గౌరవం, ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కేంద్రం వాదిస్తోంది. ఆ దృష్ట్యా ఈ ఆచారంపై నిషేధం విధించాలని కూడా అత్యున్నత న్యాయస్థానికి విన్నవించింది. 'ఈ ఆచారాన్ని స్వచ్ఛందంగానే పాటిస్తూ ఉండొచ్చు. అయితే సంబంధిత వ్యక్తుల ఆత్మ గౌరవం, ఆరోగ్యంపై ఆ ప్రభావం పడుతుంది. రాజ్యంగం చెబుతున్న న్యాయం, సమానత్వం, పరస్పర గౌరవం వంటి విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అవుతుంది' అని ఆ ఆఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. అయితే ఈ వాదనతో ప్రతివాదులు విభేదించారు. ఇది స్వచ్ఛందంగా పాటిస్తున్న ఆచారమే కానీ, ఇందులో కుల ప్రాతిపదికగా వివక్ష చూపడం ఏమీలేదని వారి వాదన.
కర్ణాటకలోని దక్షణి కనర జిల్లాలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి ఏటా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నవంబర్, డిసెంబర్ మధ్యలో ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఏటా ఏప్రిల్‌లో నెరూర్ సదాశివ బ్రహ్మేంద్ర టెంపుల్‌లో ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భాల్లో బ్రాహ్మణులు తిని వదిలేసిన ఆకులపై దళితులు పొర్లుదండాలు పెడుతుంటారు. కాగా, ఈ ఆచారంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆచారంపై నమ్మకం ఉన్నవారే పొర్లుదండాలు పెడుతున్నారని, ఇది ఐచ్ఛికమైనందున ఇది వివాదాంశం కాదని కొందరి వాదనగా ఉంది. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా ఎన్నికల్లో దళిత ఓటర్లను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ దిశగా పావులు కదుపుతోందన్న అభిప్రాయమూ పలువురిలో వ్యక్తమవుతోంది.
Comments
Post a Comment