ప్లేటుబిర్యానీ కోసం...ఆ యువతి 42 బస్సులు తగులబెట్టింది..
బెంగళూరు : ఓ మహిళ కేవలం బిర్యానీ, వందరూపాయల కోసం 42 బస్సులను తగులబెట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య రాజుకున్న కావేరి జలవివాదంపై నిరసనగా సెప్టెంబరు 12వ తేదీన తమిళనాడు ట్రాన్స్ పోర్టు ఆపరేటర్ కు చెందిన 42 బస్సులను దహనం చేశారు. బెంగళూరుకు చెందిన సి. భాగ్య అనే 22 ఏళ్ల యువతి కేవలం ప్లేటు మటన్ బిర్యానీ, వందరూపాయల నగదు కోసమే రంగంలోకి దిగి 42 బస్సులను దహనం చేసిందని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు నిర్ధారించారు. నిందితురాలైన భాగ్య కేపీఎన్ గ్యారేజీ సమీపంలోని గిరినగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. రోజూ వారీ కూలీ అయిన భాగ్య పనికెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కావేరి జలవివాదంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటే బిర్యానీతోపాటు వందరూపాయలు ఇస్తారని భాగ్య వెళ్లిందని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు. భాగ్యతో పాటు మరో 11మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బస్సుల దహనం, నిరసన ఆందోళన కార్యక్రమంలో నిందితులైన 400 మందిని అరెస్టు చేసినా, బస్సుల దహనం కేసులో భాగ్య ప్రమేయం ఉందని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెపుతున్నారు.
Comments
Post a Comment