చిన్న ఐడియా.. అద్భుత విజయం!
ఆలోచించాలి కానీ ఐడియాలకు కొదవ ఉండదు. చేసి తీరాలన్న పట్టుదల ఉండేలే కానీ సాధించలేనిది ఉండదు. ఇవి అక్షర సత్యాలని నిరూపించిందో కంపెనీ. చిన్న ఐడియాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక అసలు విషయానికి వస్తే అది ఓ డచ్ కంపెనీ. పేరు వాన్‌మూఫ్. సైకిళ్లు తయారుచేస్తుంది. సైకిళ్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇటీవల ఈ కంపెనీకి పెద్ద సమస్య వచ్చి పడింది. కంపెనీ ఎగుమతి చేస్తున్న సైకిళ్లలో 70-80శాతం సైకిళ్లపై ఉన్న రంగు డ్యామేజీ అవుతోంది. పెచ్చుల్లా ఊడిపోతోంది. దీంతో సైకిళ్లు కళావిహీనమవుతున్నాయి. దీంతో దిగుమతి చేసుకుంటున్న సంస్థల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో సరుకు తిరిగి వెనక్కి రావడం మొదలైంది. దీంతో ఏం చేయాలో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియని సంస్థ తలపట్టుకుంది.
సమస్యను అధిగమించేందుకు నిపుణులు చాలా రకాలుగా ఆలోచించారు. చివరికి వారికి ఓ ‘ఐడియా’ వచ్చింది. సైకిళ్ల ప్యాకింగ్ బాక్స్‌లపై టీవీ బొమ్మను ముద్రించాలని నిర్ణయించారు. ఆ వెంటనే అమలు చేశారు. అంతే.. అద్భుత ఫలితాలు రావడం మొదలయ్యాయి. వినియోగదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేవు. చిన్న ఐడియాతో పెద్ద సమస్యను అధిగమించిన సంస్థ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మామలుగా షిప్పింగ్ సమయంలో ప్యాకింగులను ఇష్టానుసారం విసిరిపడేస్తుంటారని, సైకిళ్లు కావడంతో ఈ సమస్య మరింత ఎక్కువ ఉంటుందని గుర్తించినట్టు వాన్‌మూఫ్ సహ వ్యవస్థాపకుడు టాకో కార్లియెర్ తెలిపారు. అదే టీవీ లాంటి సున్నిత వస్తువులైతే షిప్పింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఇష్టానుసారం విసిరేయకుండా జాగ్రత్త పడతారని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సూత్రాన్ని తమ సైకిళ్లకు కూడా ఉపయోగించుకున్నామని వివరించారు. సైకిళ్ల బాక్స్‌లను టీవీలుగా భ్రమించి వాటిని చాలా జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సో.. ఐడియా రావాలే కానీ అద్భుతాలు సృష్టించవచ్చని ఈ సంస్థ నిరూపించింది.
Comments
Post a Comment